AP CM చంద్రబాబు మార్క్ వేలిముద్ర పేమెంట్
హైటెక్ ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం చంద్రబాబుకు ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభజన నేపథ్యంలో తెలుగు ప్రజలకు గుండెకాయ లాంటి హైదరాబాద్ లేని ఏపీకి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఒకవైపు రాజధాని లేని కొరత.. మరోవైపు నిధుల కటకట.. అంతంతమాత్రంగా ఉండే ఆదాయం ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటానికి మించిన పెద్ద సమస్య మరొకటి ఉండదు. ఇలాంటి వేళ.. పాజిటివ్ అటిట్యూడ్ తో ముందుకెళుతున్న బాబుపై ఒక విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది.
గతంతో ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు బాబులో ఉన్న చురుకు ఇప్పుడులేదన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇదంతా బాబులో వచ్చిన మార్పు అనే కంటే కూడా.. చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా చోటు చేసుకుంటున్న పరిణామాలే కారణంగా చెప్పాలి. సీఎం చంద్రబాబులో చురుకుదనం ఎంతమాత్రం తగ్గలేదని.. అవకాశం రావాలే కానీ ఆయన ఎంతగా అల్లుకుపోతారన్నది తాజాగా ఉదంతాన్ని చెప్పాల్సిందే.
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్న తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలతో పాటు.. నగదు రహిత చెల్లింపులపై ప్రభుత్వాలు దృష్టి పెడుతున్న వేళ.. నగదు రహిత లావాదేవీల్ని ఎలాంటి కన్ ఫ్యూజన్ లేకుండా చేసేందుకు వీలుగా సరికొత్త సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశంలోనే తొలిసారి కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా జరుపుతున్న ఈ ప్రయోగం సక్సెస్ అవుతూ.. కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది.
నగదురహిత లావాదేవీలకు అవసరమైన యంత్రాల కోసం భారీగా ఖర్చు చేయకుండా రూ.వెయ్యి.. రూ.2వేల వ్యయంతో నగదు రహిత లావాదేవీల్ని జరిపేందుకు వీలుగా రూపొందించిన ఈ విధానం ఆసక్తికరంగా ఉండటమే కాదు.. దీన్ని మరింత లోతుగా పరిశీలించి.. పరీక్షిస్తే.. దేశ వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేసిన పక్షంలో నగదు రహిత లావాదేవీల్ని తేలిగ్గా అమలు చేయటమే కాదు.. ఈ విధానం పట్ల ప్రజలు సైతం సానుకూలంగా స్పందించే వీలుందని చెబుతున్నారు.
ఇంతకీ.. ఆ విధానం ఏమిటి? అదెలా పని చేస్తుందన్న విషయాన్ని చూస్తే.. తాను తెర మీదకు తీసుకొచ్చిన ఈ సరికొత్త టెక్నాలజీని గడిచిన రెండు రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న కలెక్టర్ల సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లలో ఈ కొత్త విధానాన్ని అమలు చేయటం గమనార్హం. నగదు రహిత చెల్లింపులంటే అయితే పేటీఎం తరహా చెల్లింపులు.. లేదంటే ఈపాస్ యంత్రాలు.. కాదంటే.. స్వైపింగ్ మెషిన్లు అవసరమవుతాయి.
కానీ.. తాజాగా రూపొందించిన విధానంలో స్మార్ట్ ఫోన్ తో కానీ.. వేలిముద్రను గుర్తించే చిన్న యంత్రాన్ని (ఇది మార్కెట్లో రూ.వెయ్యి నుంచి రూ2వేలు మాత్రమే ఖర్చు అవుతుంది) ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైనా వినియోగదారులు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేసి జేబులో పది రూపాయిలు లేకున్నా ఫర్లేదు. వేలిముద్ర యంత్రంలో వేలి ముద్రను వేయటం ద్వారా రూ.10 మన ఖాతాలో నుంచి వ్యాపారి ఖాతాలోకి సులువుగా బదిలీ చేయటమే తాజా ప్రక్రియ ప్రత్యేకత. కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు చొరవతో తెర మీదకు వచ్చిన ఈ విధానం పని చేయాలంటే కీలకమైన అంశం మాత్రం తప్పనిసరి.
అదేమంటే.. బ్యాంకు ఖాతాను అధార్ తో అనుసంధానం చేసి ఉండాలి. అదే జరిగితే.. వేలి ముద్రను స్కాన్ చేయటం ద్వారా.. సదరు వేలిముద్రను ఆధార్ తో లింక్ అప్ చేసి జత చేస్తారు. ఈ రెండు మ్యాచ్ అయిన వెంటనే.. సదరు వ్యక్తి బ్యాంకు ఖాతా ఓపెన్ అవుతుంది.అందులో ఎంత మొత్తాన్ని కట్ చేసుకోవాలో అంత మొత్తం కట్ చేసుకోవటంతో లావాదేవీ పూర్తి అవుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో రెండు అంశాలు కీలకమైనవి. ఒకటి.. వ్యాపారస్తుడి వద్ద వేలిముద్రను గుర్తించే యంత్రం లేదంటే స్కానర్ అవసరం. రెండోది.. ఖాతాదారుడు తమ బ్యాంకు ఖాతాను ఆధార్ తో అనుసంధానం చేసి ఉండాలి. ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ విధానం అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. తాజా విధానాన్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా.. ఏపీ ముఖ్యమంత్రి ఎంత హైటెక్ అన్న విషయం మరోసారి లోకానికి తెలియజేసేలా బాబు చేశారన్న మాట వినిపిస్తోంది.